Monday, May 9, 2011

ఎవరివో నీవు


సప్త స్వరాల మధురిమవో
చిరుగాలుల చల్లదనానివో......

పారే సెలయేళ్ల తుంటరితనానివో
జారే జలపాతాలా వేగం నీవో.......

రవి కిరణాల నును వెచ్చదనానివో
చల్లని జాబిల్లి నీవో.....

కురిసే అమృత వర్షానివో
విరిసే రంగుల హరివిల్లువో......

ఎవరివో నీవు

కోకిల పాటల తియ్యదనానివో
నెమలి నాట్యపు గంభీరత్వానివో.....

ప్రేమను కురిపించే హృదయానివో
బాధను మరిపించే నేస్తానివో......

చీకట్లో నడిపించే దీపానివో
ఎడారి లొనూ వీడని తోడునీవో .......

నా జీవన గమ్యానివో
నా జీవిత పరమార్దానివో
ఎవరివో నీవు
నాకు ఎవరివో నీవు 

Saturday, April 16, 2011

ఏమని చెప్పను

ఏమని చెప్పను.. వీచే చిరుగాలి స్పర్శకు ఉరిమే ఆ మేఘం కరిగి చిరు జల్లుగా ఎలా కురిసిందంటే ???
ఏమని చెప్పను..శ్వేత వర్ణ రవికిరణం ఆ జల్లులో తడిసి  ఏడు రంగుల హరివిల్లు గా ఎలా మారిందంటే???
ఏమని చెప్పను..కరిగిన ఆ మేఘం కడలిని ఎలా చేరిందంటే ..మరల తిరిగి ఎలా మేఘం అయ్యిందంటే???
ఏమని చెప్పను.. ఒక చిన్ని చిరునవ్వుతో మొదలైన మన  స్నేహం ఇంత తీపినెలా పంచిందంటే???
ఏమని చెప్పను.. నీ చేయి దూరమైన క్షణం నా కంట గంగ ఎందుకు పొంగిందంటే???
ఏమని చెప్పను.. నీ తలపులు నిండిన నా హృదయం ఈ దూరాన్ని మధురమెలా చేసిందంటే???

Thursday, February 17, 2011

దారిలో ఎర్రపూల చెట్టు


ప్రతిరొజూ నా దారిలో ఎదురౌతుంది
ఆ ఎర్రపూల చెట్టు
తన సుమాలతో కనువిందు చెసి
నాకు శుభోదయాలు పలుకుతుంది
ఆకులు కూడా కనిపించనంత గుబురుగా
ఎర్రపూలను నింపుకుని
తాను ఒక పెద్ద ముద్ద మందారం అవుతుంది

తనను చూసిన నా మనసుకు  ఎవో ఆలొచనలు
అసలా పూలకు అంత  ఎర్రదనం ఎలా వచ్చిందో ? 

ఏ చిత్రకారుడో తన కుంచెతో
ఈ పూలకింత ఎర్ర రంగు పులిమాడెమో !
ఆ హరివిల్లు తనలోని ఎరుపు రంగునంతా 
ఈ పూలపై ఒంపిందేమో 

అసలా పూలకు అంత సోయగం ఎలా వచ్చిందో ? 

భూవిహరానికి వచ్చిన గంధర్వ కన్య
తన చేతి స్పర్సతో అంత నిగారింపుని ఇచ్చిందేమో !

తమ సౌందర్యాన్ని చూసి పులకించిన
ఏ చంటి పాప కంటి మెరుపునో 
ఈ పూలు ప్రతిబింబిస్తున్నాయేమో !  

ఏమై ఉంటుందో తన సౌందర్య రహస్యం 

ఆ పూల రంగుని చూసి మోజుపడి  
తమ రెక్కలకు అద్దుకోవాలని వచ్చే సీతాకోకలు,
ఆ పూల అందాన్నంతా అస్వాదిస్తూ 
ఈ చెట్టుపై సేదతీరాలని వాలే విహంగాలు 
వీటన్నిటితో నాకొక కల్పతరువులా కనిపిస్తుంది 

నా దారిలో ఎర్రపూల చెట్టు    
   

Tuesday, January 25, 2011

నిరీక్షణ


వో నేస్తమా 
నిశిలా  మారిన మనసుకి  
ఉషోదయంలా పరిచయం అయ్యావు 

శిలగా మిగిలిన  మనిషిని 
నీ ప్రేమతో కరిగించావు 

కలలన్నవి ఎరుగని కనులకి 
కలలలోకాలను కానుక చేసావు 

చిరు నవ్వే తెలియని పెదవికి 
దరహాసం అంకితం ఇచ్చావు 


ఆశన్నది పుట్టని  గుండెలో 
చిగురాశల అలజడి రేపావు 

నేస్తమా 

నీ తలపులతో నిండిన  మనసుకి 
సందెవేల  సూర్యునిలా  దూరం  అయ్యావు 

ఎడబాటును  శిక్షగా  వేసావు 
నా  గమనం నరకం చేసావు 

కలలన్ని కల్లలు చేసావు
కన్నీటిని మిగిల్చావు  

చిరునవ్వులు  చేరిపెసావు 
చీకట్లో వదిలేశావు 

చిగురాశలు తుడిచేసావు 
నిరాశనే మిగిల్చావు 

నేస్తం 
నీ కోసం తపించే నా కోసం 
ఉదయించే రవిలా  వచ్చి 



మరు జన్మకైనా చేరుకుంటావని నా నిరీక్షణ   ......



Wednesday, January 12, 2011

ఒక సాయంత్రం

సాగర తీరానికి సాగింది నా పయనం 
నీలాకాశాన్నంతా తనలో ప్రతిబింబించాలని 
తాపత్రయ పడుతున్న సముద్రాన్ని చుస్తూ 
సూర్య కిరణాల స్పర్స కు మెరిసిపోతున్న 
ఇసుక తిన్నె మీద సేద తీరాను 
 

నా రాకను గమనించిందో ఏమో 
ఒక అలతో నాకు మౌన రాయబారం ఏదో పంపింది 
ఆ అల తన నురుగులతో నా పాదాలను స్పృశించి 
కుశల ప్రశ్నలు వినిపించింది 
చేతులతో తాకి కృతఙ్ఞతలు తెలిపే లోపే 
నన్ను అందుకోలేవంటూ వేగంగా వెనకకు మరలింది 
 

అంతలో కొంతమంది చిన్నారులు 
సాగర తీరానికి సందడి తెచ్చారు 
ముందుకు వెనుకకు పరిగెడుతూ   
అలలకు తమని అందుకోమంటూ 
సవాలు విసిరారు 
మరి కొంతమంది ఇసుకతో 
తమ తమ సౌధాలను నిర్మించుకుంటున్నారు 
పిల్లలంటే సముద్రానికి ఇష్టమో ఏమో 
వారిని చూసి తన అలల వేగాన్ని కొంచం తగ్గించింది 
 

నేను  తదేకంగా సముద్రంకేసి చూస్తుండిపోయాను
ఇప్పుడు నాకు ఆ పిల్లల కేరింతలు వినిపించడం లేదు
సముద్రం నిత్యం వ్యాపింప చేసే సందేశాల సవ్వడులను  
నేను వింటున్నాను    


సముద్రం ఒక గొప్ప బోధకురాలు  
ఎప్పుడూ నిగూఢమైన తత్వాన్ని మనకి బోధిస్తూనే ఉంటుంది 
ఎన్ని సడులు, అలజడులూ ఉన్నా 
ఎన్ని ఉప్పెనలు, తుఫాను లు ఎదురైనా 
తిరిగి తాను తన పూర్వ రూపాన్నే సంతరించుకుంటుంది
తన కర్తవ్యాన్ని తాను నేరవేరుస్తూనే ఉంటుంది 
తనది అచంచలమైన ఆత్మ విశ్వాసం 
మనిషి జీవితం కుడా సముద్రం లాంటిదే గా 




ఇలా నా ఆలోచనల్లో నేనుండగానే 
సముద్రం ఒక్కసారిగా గంభీరంగా మారింది 

సూర్యుడు అస్తమించడానికి సిధ్ధమైనట్టున్నాడు
అప్పటిదాకా నీలి వర్ణంతో మెరిసిపోయిన సముద్రం  
ఒక్కసారిగా ఎర్రదనాన్ని నింపుకుని స్వాగతం పలికింది 
మెల్లిగా సూర్యుడు కడలి ఒడిలోకి జారిపోయాడు 
సూర్యుడ్ని దాచేసానన్న గర్వం తనలో కనిపించింది 

సూర్యుడు పూర్తిగా అస్తమించాడు 
తన వెలుగుని కూడా వెనుకకు పిలిచాడు 
అప్పటిదాకా ఆడుకున్న పిల్లలు ఇళ్ళకు పరుగులు తీసారు
అందుకు అలిగిందేమో సముద్రం
పూర్తిగా వర్ణ రహితం అయ్యింది.
ఇక నేను కూడా సముద్రానికి వీడ్కోలు చెప్పాను
అలల సవ్వడులతో తాను కుడా బదులిచ్చింది
నేను నా గమ్యానికి బయల్దేరాను 

సముద్రం ముందు నుంచున్న ఒక్కో క్షణం 
ఒక్కో మధురానుభూతి 
ఎన్నో భావాలను పలికించింది 
ఎన్నో ఊసులను వినిపించింది 
ఏవేవో కొత్త కాంతులను నా మది లో నింపింది 
ఇప్పుడు సముద్రం 
నాకొక మంచి స్నేహితురాలైపోయింది

Sunday, January 9, 2011

వెలుగు- నీడ

ఏమో
తను ఎలా ఉంటుందో 

తన కోసం నా యుగయుగాల నిరీక్షణ
నాతో తన దాగుడు మూతల సయ్యాట

నేనుండగా తను రాదు
నేను తనను అందుకోలేను
తన కోసం నా ప్రయాణాన్ని శతాబ్దాలుగా సాగిస్తూనే ఉన్నా

మబ్బులపై ప్రేమ లేఖలు వ్రాసాను
చల్లగాలులతో ఆహ్వానం పంపింది 

ఒక్కసారి కనిపించు ప్రియతమా అంటే
ఒక్కసారి నన్ను అందుకో నేస్తమా అంది

ఎందుకంత పంతం, నేను లేకపోతే ప్రపంచమే లేదన్నాను నేను
ఎందుకంత అహంకారం, నేను లేకపోతే నీ విలువేది అంది తను

కొండలనడిగాను, కోనలనడిగాను, సప్త సముద్రాలని అడిగాను
తన గురించి చెప్పమని  


"నీవు నిన్ను మర్చిపోయి మమ్మల్ని మాకు గుర్తుకు తెస్తావు
ఆమె మమ్మల్ని మరిపించేలా తన మాయను వెదజల్లుతుంది

నీవు వీడిన చోట తన సోయగాల్ని నింపుతుంది
మరల నీ రాకకు కొత్త ఆహ్వానాలు పలుకుతుంది

తను నిన్ను అందుకోమంటూ చేతులు చాపుతుంది
కానీ నువ్వామేను తోసుకుంటూ ముందుకు సాగుతావు

నిన్ను తాళలేని  అశక్తత ఆమెది, ఆమెను చూడలేని దురదృష్టం నీది"

అని నా అసమర్ధత కి నవ్వుకున్నాయి

అయినా తనను చూడాలనే నా ఆరాటం ఆగదు
ఎన్ని యుగాలైనా, తన కోసం అన్వేషిస్తూ నేను
నా కోసం ఎదురు చూస్తూ తను

నేను తన పగలు  , తను నా రాత్రి

Saturday, January 8, 2011

నేస్తమా

వో నేస్తమా,  నాతో కలిసి నడు
ఏనాడూ నేనాగాను,ఏది నాకు అడ్డంకాబోదు
నీ భవిత ను నే చూపిస్తాను, నాతో కలిసి నడు 

కొత్త అవకాసాలను నీ ముందు ఉంచుతాను
పాత బాధలను మరపిస్తాను 
నీ విజయాలను మధుర స్మ్రుతులుగా మారుస్తాను
నీ అపజయాలను గుణపాఠాలు గా గుర్తుకు తెస్తాను

నీ ప్రతి కష్టం లో తోడుంటాను,
నీ ప్రతి సుఖాన్ని పంచుకుంటాను
నీ ఆశయ సాధనకు ఉపయోగపడతాను
నీ విజయానికి సాక్షి ని అవుతాను

నన్ను పూర్తిగా నీకు కానుక చేస్తాను, నాతో కలిసి నడు
బదులేది అడగను నేస్తం
కాని నీ కోసం ఆగమని మాత్రం నన్ను అడగకు
నా పేరు కాలం
( నూతన సంవత్సర శుభాకాంక్షలు )








 

స్వప్న లోకానికి

స్వాగతం